‘ద్రోహం చేసి శ్రీవారి దర్శనానికా?’: ఆరుగురు రెబల్ ఎంపీలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు!

మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన (ఉద్ధవ్ వర్గం)లో అంతర్గత సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేసి, తమ వర్గాన్ని ఏక్‌నాథ్ షిండే సేనలో విలీనం చేయాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో గురువారం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో జరిగిన అత్యవసర పార్లమెంటరీ సమావేశానికి సదరు ఆరుగురు ఎంపీలు డుమ్మా కొట్టారు. దీనిపై శివసేన (యూబీటీ) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ద్రోహులపై తాము ‘ఆపరేషన్ తుడ్వా’ (వెంటాడే కార్యక్రమం) ప్రారంభిస్తామని హెచ్చరించారు.

తిరుగుబాటు చేసిన ఆరుగురు ఎంపీలు ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లడంపై సంజయ్ రౌత్ ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు. “మొదట పార్టీకి, నమ్మిన సిద్ధాంతాలకు ద్రోహం చేసి.. ఆ తర్వాత భగవంతుడి ఆశీర్వాదం కోసం తిరుపతికి వెళ్తారా? ఇదేం సంప్రదాయం?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వాళ్లు భయంతోనే ఎక్కడెక్కడో తిరుగుతున్నారని, వారికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ ముగిసిన వెంటనే తాము పార్లమెంటు, కోర్టులతో పాటు వీధుల్లోనూ రెబల్స్‌పై చట్టపరమైన, రాజకీయ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ తిరుగుబాటు వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. రెబల్స్ వర్గంలోని ఒక్కో ఎంపీకి ఇప్పటికే రూ.15 కోట్లు ఇవ్వగా, తాజాగా మరో రూ.10 కోట్ల చొప్పున అదనంగా ముట్టజెప్పి రాజస్థాన్‌కు తరలించారని ఆరోపించారు. దేశ రాజకీయాలను బీజేపీ పూర్తిగా కలుషితం చేసిందని ధ్వజమెత్తారు. కాగా, పార్టీ విప్‌ను ధిక్కరించి సమావేశానికి రాని ఆరుగురు ఎంపీలకు ఠాక్రే వర్గం షోకాజ్ నోటీసులు జారీ చేసి, 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. అలాగే సదరు ఎంపీల సీట్ల మార్పిడి డిమాండ్లను తిరస్కరించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు