ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులతో వణికిన రష్యా: మాస్కోను కమ్మేసిన నల్లటి పొగ.. కురిసిన ‘బ్లాక్ రెయిన్’!

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నాలుగేళ్లకు పైగా సాగుతోన్న యుద్ధం మరోసారి అత్యంత భీకర స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ తన చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 500కి పైగా డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో నగరంపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో మాస్కోలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీలు, కీలక ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ బాంబుల వర్షం కురిపించింది. ఈ భారీ దాడుల ధాటికి చమురు ప్లాంట్లు తగలబడి ఆకాశాన్ని నల్లటి దట్టమైన పొగ కమ్మేయడంతో, కొద్ది గంటల్లోనే మాస్కో నగరవ్యాప్తంగా వింతగా ‘నల్లటి వర్షం’ (Black Rain) కురిసి స్థానిక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఈ కలుషిత నల్లటి వర్షం కారణంగా మాస్కో నగరవాసులు తీవ్ర తలనొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. భవనాలు, వాహనాలపై కాలుష్య జలాలు పేరుకుపోవడంతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలెవ్వరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని రష్యా అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆకస్మిక వైమానిక దాడుల ప్రభావంతో మాస్కోలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయగా, సుమారు 500కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ దాడులకు ప్రతీకారంగా రష్యా సైన్యం కూడా ఉక్రెయిన్ నగరాలైన సుమీ, ఖార్కివ్‌లపై క్షిపణులతో ఎదురుదాడులు జరపగా ఇద్దరు పౌరులు మరణించారు.

వారం వ్యవధిలో మాస్కోలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మాస్కో నగరానికి అవసరమైన ఇంధన సరఫరాలో మూడో వంతు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. రష్యా ఆర్థిక, సైనిక వనరులను గట్టిగా దెబ్బతీయడం ద్వారా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి, ఆయనను చర్చల మేజా బల్ల ముందుకు తీసుకురావడమే ఉక్రెయిన్ ప్రధాన వ్యూహమని తెలుస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన పూర్తిస్థాయి కాల్పుల విరమణకు రష్యా అంగీకరించేలా చేయడానికే ఈ దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు