‘ఇప్పుడే’ అనే క్షణంలో జీవించడమే యోగం.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

మనసు, శరీరం, ఆత్మను ఏకం చేస్తూ ఆరోగ్య సామరస్య సమ్మిళిత ప్రపంచం దిశగా స్ఫూర్తినిచ్చే కాలాతీత వరం యోగా అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రపంచానికి ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. యోగాన్ని నిజంగా నేర్చుకోవాలంటే ఒక మూడేళ్ల చిన్నారిని జాగ్రత్తగా గమనించాలని, ఆ పసివాడు గతం లేదా భవిష్యత్తులో కాకుండా కేవలం ‘ఇప్పుడు’ అనే క్షణంలోనే జీవిస్తాడని, అదే అసలైన యోగమని ఆయన స్పష్టం చేశారు.

ఒక యోగి ఎన్నో ఏళ్ల కఠిన సాధన ద్వారా వెతికి తెలుసుకునే ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ప్రతి శిశువూ జన్మిస్తుందని గురుదేవ్ వివరించారు. శిశువు శ్వాస తీసుకునే విధానం, అతని చిరునవ్వు, ఏడుపు అన్నీ లోతైన పవిత్రతతో నిండి ఉంటాయని చెప్పారు. అయితే మనం పెద్దవుతున్న కొద్దీ సమాజం, విద్య, అంచనాలు, అహంకారం వంటి అనేక పొరలు మనలోని ఆ సహజత్వాన్ని కప్పివేస్తాయన్నారు. ఒక యోగి ప్రయాణం కూడా చివరికి ఇదే లక్ష్యాన్ని చేరుకోవడం కోసమని, స్వచ్ఛమైన ప్రేమతో, సహజత్వంతో జీవించిన మనలోని ఆ ‘అంతర్గత బాలుడి’ వద్దకు తిరిగి చేరుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.

ప్రేమకూ, మాటలకూ సమాజంలో తమదైన అపారమైన శక్తి ఉంటుందని ఈ సందర్భంగా గురుదేవ్ గుర్తుచేశారు. ఒక కఠినమైన మాట వ్యక్తిని ఎంతగా గాయపరచగలదో, ఒక మృదువైన మాట హృదయాన్ని అంతగా తాకగలదని ఒక కథ ద్వారా వివరించారు. పొరపాటున నోటి నుంచి ఎవరికైనా హాని కలిగించే మాటలు వస్తే, వెంటనే దాన్ని మనసులో రద్దు చేసుకుని వారి శ్రేయస్సుకై ప్రార్థించాలని సూచించారు. యోగం అనేది హిమాలయాల్లో ప్రారంభమయ్యే ప్రయాణం కాదని, మన బాల్యంలో ఎవరినీ ద్వేషించకుండా, ఎలాంటి నటన లేకుండా జీవించిన ఆ చైతన్య స్థితిని తిరిగి గుర్తుచేసుకోవడమేనని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రబోధించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు