ఐఐటీ ప్లేస్‌మెంట్స్ కొత్త రూల్: సీవీల్లో జేఈఈ, ‘గేట్‌’ ర్యాంకులకు నో!

దేశంలోని 23 ఐఐటీల ఉమ్మడి ప్లేస్‌మెంట్ కమిటీ (AIPC) క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లలో ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ల కోసం విద్యార్థులు సమర్పించే రెజ్యూమేలు లేదా సీవీల్లో (CV) జేఈఈ ర్యాంకులు, గేట్ స్కోర్లు లేదా పర్సంటైల్ వంటి వివరాలను రాయకూడదని నిర్ణయించింది. ఒకప్పుడు ఐఐటీలో సీటు సాధించడంతో పాటు ప్రవేశ పరీక్షల ర్యాంకు కూడా విద్యార్థులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేది, కానీ ఇకపై ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలో ఈ వివరాలు కనిపించవు.

ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం నియామకాల్లో వివక్షను నివారించడమేనని కమిటీ స్పష్టం చేసింది. ప్రవేశ పరీక్షల ర్యాంకుల ఆధారంగా కాకుండా, విద్యార్థి ఐఐటీలో చేరిన తర్వాత కనబరిచిన ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. కొన్ని సందర్భాల్లో కంపెనీలు ఈ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థి ఏ కేటగిరీ ద్వారా సీటు సాధించాడో సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని, అది ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో పక్షపాతానికి లేదా వివక్షకు దారితీయవచ్చనే ఆందోళనలతో ఈ సరికొత్త మార్గదర్శకాలను అమలులోకి తెచ్చారు.

కొత్త నిబంధనల ప్రకారం, విద్యార్థులు తమ సీవీలలో జేఈఈ లేదా గేట్ ర్యాంకులకు బదులుగా.. ఐఐటీలో సాధించిన సీపీఐ (CPI), విద్యా ప్రతిభ, చేసిన ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills), నాయకత్వ అనుభవం వంటి విషయాలను ప్రముఖంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ రిక్రూట్ చేసుకునే కంపెనీలు ప్రత్యేకంగా అడిగితే తప్ప, ఈ స్కోర్లను ముందుగానే సీవీల్లో చేర్చడానికి వీల్లేదు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి; కొందరు దీనిని సమాన అవకాశాలు కల్పించే మంచి నిర్ణయంగా స్వాగతిస్తుంటే, మరికొందరు ఎంతో కష్టపడి సాధించిన జాతీయ స్థాయి ర్యాంకులను దాచమనడం ప్రతిభను తగ్గించడమేనని విమర్శిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు