ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన నటన ప్రస్థానం గురించి, కెరీర్ తొలినాళ్లలోని అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటనపై తనలో ఆసక్తిని పెంచడంలో, తనను తాను నటుడిగా తీర్చిదిద్దుకోవడంలో థియేటర్ (రంగస్థలం) కీలక పాత్ర పోషించిందని ఆయన వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో ఫలానా ప్రాజెక్ట్ చేయాలని ఎంచుకునే అవకాశం తనకు లేదని, ఏ పని దొరికినా, ఏ వేదిక దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపనతో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నట్లు వివరించారు.
చిన్న వయసులోనే తనలోని శక్తిని సరైన మార్గంలో పెట్టేందుకు రంగస్థలం ఎంతగానో దోహదపడిందని విజయ్ తెలిపారు. నటుడిగా, వ్యక్తిగా తనను తీర్చిదిద్దడంలో థియేటర్ పాత్ర ఎంతో ఉందని, అది మనలోని బంధనాలను తెంచి నటుడిగా ఒక స్వేచ్ఛను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో కేవలం తన ప్రతిభను ప్రజలకు చూపించడానికి ఏదో ఒక అవకాశం కావాలి అనుకునేవాడినని, ఆ సమయంలో లభించిన రంగస్థల అనుభవమే ఈ రోజు తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని స్పష్టం చేశారు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన తన భార్య రష్మిక మందన్నతో కలిసి ‘రణబాలి’ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 1850ల నాటి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, బ్రిటీష్ వారు తప్పుగా చిత్రీకరించిన కొన్ని చారిత్రక అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో పాటు ‘రౌడీ జనార్దన’, ‘VD x శౌర్యువ్’ (వర్కింగ్ టైటిల్) అనే ప్రాజెక్టులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.









