భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రోప్‌వే!

చారిత్రాత్మక భువనగిరి కోట అభివృద్ధి పనులను అక్టోబర్ 2వ తేదీలోగా పూర్తిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం భువనగిరి కోట వద్ద పర్యటించిన ఆయన, అక్కడ శరవేగంగా కొనసాగుతున్న వివిధ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైతే రాత్రింబవళ్లు షిఫ్టుల వారీగా పనులు చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా కోట వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రోప్‌వే పనులతో పాటు పర్యాటక హోటల్, పార్కింగ్‌, మరుగుదొడ్లు, చిన్నారుల ఆట స్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫ్‌, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్‌ వంటి ఆధునిక సదుపాయాలను మంత్రి పరిశీలించారు. చారిత్రక వైభవాన్ని కాపాడుతూనే భువనగిరి కోటను సరికొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో యాదాద్రి, భువనగిరి కోట, మరియు కొలనుపాకలను అనుసంధానిస్తూ ఒక సమగ్ర ఆధ్యాత్మిక-వారసత్వ పర్యాటక సర్క్యూట్‌ను డెవలప్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జూపల్లి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘స్వదేశ్ దర్శన్ 2.0’ పథకం కింద రూ.56.81 కోట్లతో ‘భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియెన్షియల్ జోన్’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఈ నిధులలో రూ.17.91 కోట్లను 1,020 మీటర్ల పొడవైన అత్యాధునిక రోప్‌వే నిర్మాణం కోసం కేటాయించారు. గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని, మిగిలిన నిధులతో రోడ్లు, వ్యూయింగ్ గ్యాలరీ, విద్యుదీకరణ, తాగునీరు, సీసీ కెమెరాలు మరియు హై-సెక్యూరిటీ సిస్టమ్స్ వంటి వసతులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు