మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల లోహగడ్ కోట వద్ద జూన్ 19న కేతన్ అగర్వాల్ (26) అనే వ్యాపారవేత్త లోయలో పడి మృతిచెందిన ఘటనలో పోలీసులు ఊహించని నిజాలు వెలుగులోకి తెచ్చారు. మొదట ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జారిపడ్డాడని భావించినప్పటికీ, లోతైన దర్యాప్తు తర్వాత ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులు కుదిర్చిన ఈ పెళ్లి ఇష్టం లేని సియా గోయల్, తన ప్రియుడితో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే జూన్ 14న కూడా లోహగడ్ కోట వద్ద పాము పేరుతో భయపెట్టి లోయలోకి నెట్టేయాలని చూసి విఫలమయ్యారు. ఆ తర్వాత మళ్లీ జూన్ 19న సియా పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కేతన్‌ను నమ్మించి కోట వద్దకు తీసుకెళ్లి, ప్రియుడితో కలిసి సుమారు 350 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి మరణానికి కారణమైనట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి.
ఈ కేసును మలుపు తిప్పింది సియా మొబైల్ ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా చాటింగ్స్ వంటి డిజిటల్ ఆధారాలేనని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పెళ్లికి ముందు ఇద్దరూ బాలీ వెళ్లేందుకు ప్లాన్ చేయగా, సియా కావాలనే హోటల్ వాష్‌రూమ్‌లో తన పాస్‌పోర్ట్‌ను చింపివేసి ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నట్లు కూడా గుర్తించారు. నిశ్చితార్థం తర్వాత జైపూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, ప్రియుడి కోసం కాబోయే భర్తను లోయలోకి నెట్టేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.









