పెరియార్ సిద్ధాంతాలు ఓకే.. కానీ నాస్తికత్వాన్ని అంగీకరించం: అసెంబ్లీలో తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) అసెంబ్లీ వేదికగా తన ప్రభుత్వ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ద్రావిడ ఉద్యమ మూలపురుషుడు పెరియార్ రామస్వామి సామాజిక ఆశయాలను తాము మనస్ఫూర్తిగా స్వీకరించినప్పటికీ, ఆయన ప్రబోధించిన నాస్తికత్వ (Atheism) భావజాలాన్ని మాత్రం తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. తాము దేవుడిని బలంగా విశ్వసిస్తామని, ఈ విషయాన్ని ఎప్పుడూ దాచాల్సిన అవసరం లేదని సభలో కుండబద్దలు కొట్టారు. తమ నూతన ప్రభుత్వానికి పెరియార్‌తో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మాజీ సీఎం కామరాజ్ ఆదర్శాలే దిక్సూచి అని పేర్కొన్నారు.

తమ పార్టీని కేవలం ఒక సినీ నటుడి పార్టీగా తక్కువ చేసి చూపే విమర్శకులకు సీఎం విజయ్ సభలో గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ఎదుగుదలను జీర్ణించుకోలేక కొందరు ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగి రికార్డు స్థాయిలో 35 శాతం ఓట్లు సాధించిందని విజయ్ గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.72 కోట్ల మంది ఓటర్ల అపార మద్దతుతో తమ పార్టీ స్వతంత్ర రాజకీయ శక్తిగా అవతరించిందని ధీమా వ్యక్తం చేశారు. కులమతాల కృత్రిమ గోడలను బద్దలు కొట్టి, ముందుగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాకే తాము పార్టీని స్థాపించామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో సభలో విజయ్ చేసిన అవినీతి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గత ప్రభుత్వం (డీఎంకే) పార్టీ నిధుల పేరుతో భారీ ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడిందని సీఎం విజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు, వామపక్షాల (Left Parties) చేరికపై స్పందిస్తూ.. లెఫ్ట్ పార్టీలు తమ కూటమిలోకి ఎవరి దయాదాక్షిణ్యాల వల్లో రాలేదని, అవి స్వచ్ఛందంగానే ప్రజా ప్రయోజనాల కోసం తమతో చేతులు కలిపాయని విజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు