భారతదేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను అత్యంత వేగంగా అనుసంధానించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ముందడుగు వేసింది. రైల్వే మౌలిక సదుపాయాల రంగాన్ని ఆధునీకరిస్తూ దేశంలోని వివిధ పారిశ్రామిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ ఏడు కొత్త హై-స్పీడ్ (బుల్లెట్ రైలు) కారిడార్లకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జపాన్ సాంకేతిక సహాయంతో నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉండగానే కేంద్రం ఈ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించడం విశేషం.
కేంద్రం కొత్తగా గుర్తించిన ఏడు కారిడార్లలో ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి మరియు వారణాసి-సిలిగురి మార్గాలు ఉన్నాయి. ఈ సరికొత్త హై-స్పీడ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గనుంది. అంచనాల ప్రకారం ముంబై-పుణె ప్రయాణానికి కేవలం 48 నిమిషాలు, బెంగళూరు-హైదరాబాద్కు 2 గంటల 10 నిమిషాలు, మరియు ఢిల్లీ-వారణాసి మధ్య ప్రయాణానికి కేవలం 3 గంటల 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
ఈ మెగా ప్రాజెక్టు ద్వారా బీహార్ మరియు తూర్పు భారతదేశానికి కూడా భారీ లబ్ధి చేకూరనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీ-వారణాసి-పాట్నా కారిడార్ పూర్తియితే పాట్నా నుండి ఢిల్లీకి ప్రయాణ సమయం 4 గంటల 41 నిమిషాలకు తగ్గిపోతుందని, దీనిని తూర్పున సిలిగురి వరకు విస్తరించే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఈ కారిడార్ల నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభం కావడానికి ముందు భూసేకరణ, సాధ్యాసాధ్యాల అధ్యయనాలు (Feasibility Studies), మరియు చట్టబద్ధమైన అనుమతులు వంటి సుదీర్ఘ ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.









