తమిళనాడులో ముందస్తు ఎన్నికల నగారా? డీఎంకే శ్రేణులకు ఎంకే స్టాలిన్ కీలక పిలుపు

తమిళనాడు రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని, అసెంబ్లీ ఎన్నికల కోసం మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండానే, రాబోయే మూడు లేదా ఆరు నెలల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు ఏఐఏడీఎంకే (AIADMK) నేతలు డీఎంకేలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఆగకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే (TVK) ప్రభుత్వానికి సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ లేదని ఎంకే స్టాలిన్ గుర్తుచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్ల మెజారిటీ అవసరం కాగా, ఆ పార్టీకి కేవలం 108 స్థానాలు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం ఇతర పార్టీల మద్దతుతోనే బండి నడుస్తోందని విమర్శించారు. నిన్నటివరకు డీఎంకే కూటమిలో భాగమైన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల ఊతంతో సాగుతున్న ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమని, అందుకే డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై కూడా స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత నెల రోజులుగా తమిళనాడులో అభివృద్ధి పూర్తిగా మందగించిందని, శాంతిభద్రతలు క్షీణించి మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, దోపిడీలు మరియు పెట్రోల్ బాంబు దాడులు పెరిగాయని ఆరోపించారు. ఇదే విషయమై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సైతం స్పందిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి కేవలం ప్రచారంపైనే శ్రద్ధ పెడుతోందని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యల చర్చా వేదికలా కాకుండా కేవలం ఒక సినిమా షూటింగ్‌లా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు