ప్రపంచంలోని దేశాలన్నీ గనుక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే కంపెనీల వంటివైతే.. తాను కళ్లు మూసుకుని భారతదేశంపైనే పెట్టుబడి పెడతానని అమెరికా సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ స్టీవ్ డైన్స్ సంచలన ప్రకటన చేశారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. ప్రస్తుతం అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా మారిందని, ఏ బంధానికైనా నమ్మకం అనేది చాలా కీలకమని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) నుంచి ప్రతిష్టాత్మక ‘2026 పబ్లిక్ సర్వీస్ అవార్డు’ అందుకున్న సెనేటర్ స్టీవ్ డైన్స్.. భారత్ ఆర్థిక పురోగతిని విశ్లేషిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని టాప్ 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో జీడీపీ పరంగా భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉందని, అతి త్వరలోనే నాలుగో స్థానానికి చేరుకోబోతోందని పేర్కొన్నారు. కేవలం ప్రస్తుత సంవత్సరమే కాకుండా, రాబోయే ఏడాదికి కూడా అత్యధిక జీడీపీ వృద్ధి రేటును నమోదు చేయబోతున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని కొనియాడారు.
ఇదే సమయంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి అడుగులు వేస్తున్నారని స్టీవ్ డైన్స్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రతిభావంతులైన నిపుణులు, విద్యార్థుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు హెచ్-1బీ (H-1B) వీసా విధానంలో సరళీకరణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడుతూనే.. ఇటీవల కాలంలో వారిపై జరుగుతున్న ద్వేషపూరిత దాడులను సెనేటర్ తీవ్రంగా ఖండించారు.









