ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌పై దాడి చేశారనే ఆరోపణలతో గత రెండు రోజులుగా వార్తల్లో నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర కథానాయకుడు అఖిల్ రాజ్ ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, అసలు తప్పు డెలివరీ బాయ్‌దేనంటూ ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. తాను కూడా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఒక సాధారణ డెలివరీ బాయ్‌గా వీధుల్లో తిరిగి కష్టపడ్డానని, ఎండనక వాననక వారు చేసే ఉద్యోగం విలువ, పడే శ్రమ తనకు పక్కాగా తెలుసంటూ అఖిల్ రాజ్ ఎమోషనల్ అయ్యారు.
ఈ వివాదానికి గల ముందస్తు కారణాలను హీరో అఖిల్ రాజ్ మీడియా ముందు వివరిస్తూ.. సదరు డెలివరీ బాయ్ మొదట తమ చిరునామా కాకుండా తప్పుడు అడ్రస్‌కు పార్సిల్ ఇచ్చి వెళ్లాడని పేర్కొన్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని తిరిగి తమ ఇంటికి వచ్చి అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. సదరు డెలివరీ ఏజెంట్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని, తమ మధ్య మాట మాట పెరిగిన క్రమంలో తన తల్లిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడని హీరో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేశంలో కేవలం తోపులాట, వాగ్వాదం జరిగిందే తప్ప.. కావాలని తాను ఎవరిపైనా ప్లాన్డ్ గా దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
సెలబ్రిటీ హోదాలో ఉండి అహంకారంతో ప్రవర్తించారంటూ నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్‌కు అఖిల్ రాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తానేమీ నేరుగా హీరో కాలేదని, ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చానని గుర్తుచేశారు. ఒక డెలివరీ బాయ్‌పై కక్ష గట్టి దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని, కేవలం తన తల్లిని అవమానించినందుకే ఒక కొడుకుగా ఆ సమయంలో స్పందించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఈ వివరణతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ వివాదానికి సరికొత్త ట్విస్ట్ లభించినట్లయింది.









