జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా వచ్చి ఆహ్వానించిన ఇండోనేషియా అధ్యక్షుడు..

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండోనేషియా రాజధాని జకార్తాకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం అక్కడి చేరుకున్న ఆయనకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలకడం విశేషం. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా ఈ ప్రత్యేక ఆతిథ్యాన్ని భావిస్తున్నారు.

 

భారత ప్రధాని ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌ చేశాయి. జకార్తా విమానాశ్రయంలో సంప్రదాయ ఇండోనేషియా నృత్య ప్రదర్శనలతో మోదీకి ఆత్మీయ స్వాగతం లభించింది.

 

ఈ పర్యటనలో మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

 

పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చేశామని మోదీ గుర్తు చేశారు. ఈ భాగస్వామ్యం తర్వాత తన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదేనని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రబోవో పర్యటనకు కొనసాగింపుగానే ఈ భేటీ జరుగుతోందని తెలిపారు.

 

ఇండోనేషియాలోని భారతీయ ప్రవాసులతో మోదీ సమావేశం కానున్నారు. అలాగే ప్రబోవోతో కలిసి యోగ్యకర్తలోని ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయం భారత్-ఇండోనేషియా సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.

 

ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో సహకారం మరింత బలపడింది. బ్రహ్మోస్‌ క్షిపణుల విక్రయం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర భద్రత, సైనిక శిక్షణ, రక్షణ పరిశ్రమల్లో భాగస్వామ్యం విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక వాణిజ్యం 24.78 బిలియన్‌ డాలర్లకు చేరగా, 130కి పైగా భారత కంపెనీలు ఇండోనేషియాలో పెట్టుబడులు పెట్టాయి.

 

ఇండోనేషియా పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించనున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు