సింగరేణికి మరో 2 బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటన..

సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్‌లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌తో పాటు తాడిచెర్ల-2 కోల్‌ బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు.

 

ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్‌ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ సింగరేణికి దక్కేలా కేంద్రం చొరవ తీసుకుందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు బ్లాక్‌ల వేలంలోనూ సింగరేణి పాల్గొనేలా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 

నైనీ కోల్‌ బ్లాక్‌లో మరో 35 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. దీని వల్ల సింగరేణికి సుమారు రూ.75 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో లక్షలాది కుటుంబాల జీవనాధారం సింగరేణి అని పేర్కొన్నారు.

 

తాడిచెర్ల-2 కోల్‌ బ్లాక్‌ను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ బ్లాక్‌తో సంస్థ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. భవిష్యత్తులో ఉత్పత్తి పెరగడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు