ఈసీపై ముస్లిం ఎమ్మెల్యేల ఒత్తిడి..! బీజేపీ సంచలన ఆరోపణలు..

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చి, తమ సామాజిక వర్గానికి చెందిన వారినే బూత్ స్థాయి అధికారులుగా (బీఎల్ఓ) నియమించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ చర్య ద్వారా అనర్హులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

 

అదేవిధంగా, రాష్ట్రంలో శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను (పీఆర్సీ) జారీ చేయాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన డిమాండ్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు.

 

ప్రస్తుతం తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన వారిని కొత్త ఓటర్లగా నమోదు చేయడం, మరణించిన వారు లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో ఉన్న బంగ్లాదేశీయులు, రోహింగ్యా అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో చేర్పించడమే లక్ష్యంగా ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నారని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. “దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు పౌరసత్వం కల్పించడానికే అసదుద్దీన్ ఒవైసీ పీఆర్సీ కార్డుల డిమాండును తెరపైకి తెచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధం మరియు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్య” అని ఆయన పేర్కొన్నారు.

 

నివాస ధ్రువీకరణ పత్రాల కోసం పేద ప్రజలు ఇబ్బంది పడకుండా, భవిష్యత్తులో పౌరసత్వానికి సంబంధించిన ఎటువంటి చిక్కులు తలెత్తకుండా కర్ణాటక నమూనాలో పీఆర్సీలు జారీ చేయాలని సోమవారం అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

 

కాగా, బీఎల్ఓల నియామకం ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి రాదని, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇది పూర్తిగా ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే సాగుతుందని ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులు, డూప్లికేట్ ఓటర్లను తొలగించే విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు