భారీ ఏఐ ఖర్చులతో మైక్రోసాఫ్ట్ కొత్త వ్యూహం..!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి వ్యభరితమైన థర్డ్ పార్టీ ఏఐ సిస్టమ్స్‌పై ఆధారపడటాన్ని నియంత్రిస్తూ, సొంతంగా అభివృద్ధి చేసిన ‘ఎంఏఐ’ మోడల్స్‌ను వినియోగించడం ప్రారంభించింది. ఎక్సెల్, ఔట్‌లుక్ వంటి తమ పాపులర్ అప్లికేషన్లలో ఇప్పటికే ఈ మార్పును అమలు చేస్తోంది.

 

తాజా నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వారానికి పదుల వేల సంఖ్యలో యూజర్ రిక్వెస్టులను తన సొంత ఎంఏఐ మోడల్స్‌కు మళ్లిస్తోంది. మొత్తం రిక్వెస్ట్‌లతో పోలిస్తే ఇది తక్కువ శాతమే అయినప్పటికీ, ఏఐ నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు ఇది ఒక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

 

గత జూన్ నెలలో నిర్వహించిన ‘బిల్డ్’ కాన్ఫరెన్స్‌లో మైక్రోసాఫ్ట్ ఏడు కొత్త ఎంఏఐ మోడల్స్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం వాటిని వ్యూహాత్మకంగా తమ ఉత్పత్తులలో అనుసంధానిస్తోంది. సాధారణ మరియు తేలికపాటి పనుల కోసం ఎంఏఐ మోడల్స్‌ను ఉపయోగిస్తూ, కేవలం సంక్లిష్టమైన ప్రశ్నల కోసం మాత్రమే ఓపెన్‌ఏఐ వంటి శక్తిమంతమైన, ఖరీదైన మోడల్స్‌ను వినియోగించాలని నిర్ణయించింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ మార్పు వల్ల మైక్రోసాఫ్ట్‌కు నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

 

కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా అమెజాన్, ఉబెర్, మెటా, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఏఐ నిర్వహణ వ్యయాన్ని నియంత్రించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏఐ ద్వారా ఉత్పాదకత పెరిగినప్పటికీ, దాని నిర్వహణకు అయ్యే భారీ వ్యయాలను తగ్గించుకోవడం ప్రస్తుతం టెక్ కంపెనీలకు సవాలుగా మారింది. ఏఐ రంగం పరిణతి చెందుతున్న దశకు ఈ పరిణామాలే నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు