గుటుపల్లె భూముల వివాదం.. స్వయంగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు..

నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల రైతులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపారు. గత ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిన వేలాది ఎకరాల భూములకు విముక్తి కల్పించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా బనగానపల్లె తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం, తన సమక్షంలోనే అధికారిక ప్రక్రియను పూర్తి చేయించారు.

 

బేతంచెర్ల మండలం గుటుపల్లె గ్రామంలోని సర్వే నెం. 215లో ఉన్న 2,669 ఎకరాల సర్వీసు ఇనాం భూములను గత ప్రభుత్వం 1908 నాటి చట్టాన్ని కారణంగా చూపి 22ఏ జాబితాలో చేర్చింది. దీంతో రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో తమ గోడును ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. వారి వినతిపై స్పందించిన ప్రభుత్వం, 2,074 ఎకరాల పట్టాభూమిని 22ఏ(1)(సి) జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది.

 

గురువారం బనగానపల్లె తహసిల్దార్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్‌లు ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్ ద్వారా ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఈ ప్రక్రియను అధికారులు సీఎంకు వివరించారు. ఇదే సమయంలో, 2023లో జాబితాలో చేర్చిన 426 ఎకరాల వక్ఫ్ భూములను కూడా తొలగించడంతో 897 మంది రైతులకు లబ్ధి చేకూరింది. వీటితో పాటు బనగానపల్లె నియోజకవర్గంలో 23 మంది రైతులకు చెందిన 101 ఎకరాల చుక్కల భూములను కూడా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో లబ్ధిదారులైన రైతులతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు వారి భూములను తిరిగి అప్పగించామని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు