భారత స్టాక్ మార్కెట్లో ప్రముఖ జ్యువెలరీ రిటైల్ దిగ్గజం ‘కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా’ (Kalyan Jewellers India) షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ స్టాక్ వరుసగా మూడో రోజూ తన జోరును కొనసాగించింది. ఒక ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ ఇచ్చిన పాజిటివ్ రేటింగ్ మరియు కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిపై ఇన్వెస్టర్లలో పెరిగిన నమ్మకం కారణంగా ఈ షేరు ఏకంగా 7 శాతానికి పైగా లాభపడి, బీఎస్ఈ (BSE) మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో టాప్ గైనర్‌గా నిలిచింది.
శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ షేరు 7.2 శాతం పెరిగి గరిష్టంగా రూ. 475 స్థాయిని తాకింది. గత మూడు సెషన్లలోనే ఈ స్టాక్ ఏకంగా 33.9 శాతం మేర లాభపడటం విశేషం. ఈ తాజా ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Cap) విలువకు దాదాపు రూ. 11,500 కోట్లు అదనంగా జతకూరాయి. దీంతో ప్రస్తుత సెషన్లో కళ్యాణ్ జ్యువెలర్స్ మొత్తం మార్కెట్ విలువ రూ. 48,850 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో కోల్పోయిన నష్టాలన్నింటినీ ఈ మూడు రోజుల ర్యాలీతో దాదాపుగా భర్తీ చేసుకుంది.
ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటీగ్రూప్ (Citigroup) ఈ స్టాక్‌పై పాజిటివ్ రిపోర్టును ఇవ్వడం వల్లే మార్కెట్లో ఈ కొనుగోళ్ల జోరు పెరిగింది. కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్‌కు సిటీగ్రూప్ తన ‘బై’ (Buy) రేటింగ్‌ను ఇస్తూ.. ప్రతి షేరుకు ఏకంగా రూ. 750 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. జూన్ త్రైమాసికంలో (Q1) కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 38 శాతంగా నమోదైంది. ఇది తమ అంచనాల కంటే స్వల్పంగా తగ్గినప్పటికీ, కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి దృక్పథంలో ఎలాంటి మార్పు లేదని, భవిష్యత్తులో ఈ సంస్థ మరింత బలోపేతం అవుతుందని సిటీ గ్రూప్ స్పష్టం చేసింది.









