ప్రజల ప్రయోజనాల విషయంలో తనకు తెలంగాణే మొదటి ప్రాధాన్యమని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగత అంశాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సాగునీటి నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నప్పటికీ, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వర్షాకాలంలోనూ సాగునీరు అందక రైతులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోసమే జరిగిందని గుర్తుచేసిన ఈటల.. రాజకీయాలు, సిద్ధాంతాలు వేరైనా మూలాలను మరచిపోవద్దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ‘జలయజ్ఞం’ ద్వారా ప్రాణహిత జలాలను తరలించే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయని, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులకు అప్పుడే శ్రీకారం చుట్టారని వివరించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించే ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన కమీషన్లు, డిజైన్ మార్పుల తప్పులపై తాను మాట్లాడడం లేదని, కానీ కొన్ని లోపాల నెపంతో మొత్తం ప్రాజెక్టునే తప్పుపట్టడం దుర్మార్గమని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు వల్లే హుజూరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రైతాంగానికి రెండు పంటలు పండించే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పరిధిలో దెబ్బతిన్న నిర్మాణాలకు ప్రభుత్వం వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, ఒకవేళ ఈ మరమ్మతుల్లో జాప్యం చేస్తే భవిష్యత్తులో రాష్ట్రం తీవ్ర కరవును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.









