“పల్లి పల్లి మినిస్టర్”.. విజయవంతంగా ముగిసిన మంత్రి లోకేశ్‌ కొరియా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే పరమావధిగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసింది. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన ఈ విదేశీ పర్యటన ఇరు దేశాల వాణిజ్య బంధంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ నేతృత్వంలోని ఏపీ ప్రతినిధి బృందానికి అక్కడి ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి అపూర్వమైన గౌరవం, సానుకూల స్పందన లభించాయి.

ఈ వారం రోజుల వ్యవధిలో మంత్రి లోకేశ్‌ ఏకంగా 50కి పైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించి ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఎల్జీ, హ్యుందాయ్, శాంసంగ్, బీఎన్‌కే ఫైనాన్షియల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. ముఖ్యంగా ఎల్జీ సంస్థ తమ ప్రధాన కార్యాలయానికి లోకేశ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవ విందు ఇవ్వడం విశేషం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలపై మంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్‌కు ముగ్ధులైన కొరియన్ ప్రతినిధులు, తమ ఉన్నత యాజమాన్యాలతో చర్చించి ఏపీలో పెట్టుబడులపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కొరియా ఇన్వెస్టర్లకు మరింత చేరువయ్యేందుకు వీలుగా అక్కడి ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్‌లో మంత్రి లోకేశ్‌ ‘అపెక్స్-కొరియా’ (ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌టర్నల్ ఎంగేజ్‌మెంట్-కొరియా) సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు. కాగా, ఏపీలో ప్రభుత్వం అనుసరిస్తున్న ‘3ఎస్’ మోడల్ (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం, లోకేశ్‌ శరవేగంగా నిర్ణయాలు తీసుకునే శైలిని చూసి ముగ్ధులైన కొరియన్ ప్రతినిధులు ఆయన్ను ‘పల్లి.. పల్లి మంత్రి’ అని ముద్దుగా పిలుచుకున్నారు. కొరియన్ భాషలో ‘పల్లి పల్లి’ అంటే ‘త్వరగా త్వరగా’ అని అర్థం. లోకేశ్‌ బృందం చూపిన పని వేగాన్ని కొరియా వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (కోట్రా) దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్‌హూన్ కిమ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు