ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని పరిసర ప్రాంతాలు శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి వేదికయ్యాయి. బీఆర్ఎస్ అగ్రనేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించేది లేదంటూ సింగరేణి రక్షణ సిబ్బంది, పోలీసులు గేటు వద్దే నిరోధించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, తన పార్టీ శ్రేణులతో కలిసి పోలీసుల బారికేడ్లను, గేట్లను నెట్టుకుంటూ గని లోపలికి దూసుకెళ్లారు.
ఈ తోపులాటల మధ్యే కవిత గని ప్రాంగణంలోనే కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై, వారి క్షేత్రస్థాయి సమస్యలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులను సైతం సింగరేణి భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ కాసేపు తీవ్ర నెట్టులాట జరిగింది. చివరకు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు అదనపు బలగాలను భారీగా మోహరించాల్సి వచ్చింది. కార్మికుల హక్కుల కోసం భద్రతా వలయాలను దాటుకుని వెళ్లిన కవిత వైఖరితో సత్తుపల్లి సింగరేణి ప్రాంతంలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది.
గని ప్రాంగణంలో నిర్వహించిన కార్మిక సదస్సులో కల్వకుంట్ల కవిత అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శల దాడికి దిగారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్కు ఇంకా కేవలం వెయ్యి రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికుల చిరకాల డిమాండ్ అయిన డిపెండెంట్ ఉద్యోగాల (కారుణ్య నియామకాలు) భర్తీపై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తే, ఈ నెల 20వ తేదీన హెచ్ఎంఎస్ (HMS) కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో తానే స్వయంగా నిరాహార దీక్షకు కూర్చుంటానని కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితమైన డెడ్లైన్ విధించారు.









