జేసీ అస్మిత్ రెడ్డి చొరవ: యాడికి కాలువ పునరుద్ధరణ పనులకు మహర్దశ

రాయలసీమ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే నమ్మకంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి యాడికి కాలువ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. దశాబ్దాలుగా పూడికతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువను ఆధునీకరించడం ద్వారా నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు కూడా కృష్ణా జలాలను చేర్చడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక మరమ్మతు పనుల కోసం ఆయన కూటమి ప్రభుత్వం నుండి రూ.40 లక్షల నిధులను తక్షణమే మంజూరు చేయించారు.

పెద్దవడుగూరు మండలంలో ప్రారంభమై సుమారు 24 కిలోమీటర్ల మేర సాగే ఈ యాడికి కాలువ ద్వారా మొత్తం 22కు పైగా గ్రామాలకు సాగు, తాగునీరు అందాల్సి ఉంది. అయితే గతంలో జంగిల్ క్లియరెన్స్, పూడిక పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహం సరిగ్గా సాగేది కాదు. దీనిని గమనించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ప్రభుత్వం ఇచ్చిన నిధులకు తోడుగా తన సొంత సొమ్మును కూడా కలుపుకుని మొత్తం రూ.70 లక్షల భారీ వ్యయంతో గత నాలుగు రోజుల నుండి కాలువ పూడికతీత పనులను శరవేగంగా చేయిస్తున్నారు. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో కురిసే వర్షపు నీరు వృథా కాకుండా కాలువ ద్వారా ప్రవహించేలా భారీ యంత్రాలతో అహోరాత్రులు పనులు నిర్వహిస్తున్నారు.

ఈ పూడికతీత పనుల వల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, కరవు మండలాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చివరి ఆయకట్టు గ్రామమైన వెంకటాంపల్లికి సాగునీరు రావడం ద్వారా ఆ మార్గంలోని బ్రాహ్మణపల్లి పెద్ద చెరువును పూర్తిగా నింపేందుకు వీలు కలుగుతుంది. సాగునీటి లభ్యత పుష్కలంగా ఉంటే ఈ ప్రాంత నేలల్లో జామ, సపోటా, దానిమ్మ, అరటి వంటి వాణిజ్యపరమైన పండ్ల తోటలను విస్తృతంగా సాగు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయడానికి స్థానిక రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నం పట్ల కరవు ప్రాంత రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు