అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తమ స్వాధీనం చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం జరిగిన ‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిని ఇకపై తామే నిర్వహించి, దానికి రక్షకుడిగా మారబోతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా సైనికులను ప్రమాదంలోకి నెట్టినందుకు గానూ పరిహారంగా ఈ జలసంధి గుండా వెళ్లే కార్గో (సరుకు రవాణా) నౌకలపై 20 శాతం ఫీజు వసూలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటివరకు ఎటువంటి ప్రతిఫలం లేకుండానే ఈ జలసంధిని అమెరికా కాపాడుతూ వచ్చిందని, అయితే ఇకపై ధనిక దేశాలు ఈ రక్షణ ఏర్పాట్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో ఇరాన్ ఘోరంగా దెబ్బతిందని, ఇప్పటికే దాని నేవీ, ఎయిర్‌ఫోర్స్, మరియు క్షిపణి సామర్థ్యాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై ప్రారంభించిన దాడుల అనంతరం గతవారం కాల్పుల విరమణ ముగిసినట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. అమెరికా జరిపిన సైనిక దాడులకు ప్రతిస్పందనగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిన్ అథారిటీ (పీజీఎస్ఏ) ప్రకటించింది. జలసంధిలో నౌకల రాకపోకలను ప్రస్తుతానికి నిలిపివేశామని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ముందస్తు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులను సమీక్షించి, వెబ్‌సైట్ ద్వారా అనుమతుల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. హర్మూజ్ మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు మరియు సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.









