•పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మద్యం బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి..
• వాటిని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తుంది..
• ఇప్పటికైనా బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోండి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించిన… గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు
భద్రాచలం జూలై 14: D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి..
దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఎక్కడబడితే అక్కడ పుట్టగొడుగుల్లా మద్యం బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని వీటి వెనక మద్యం మాఫియా హస్తముందని, కాబట్టి బెల్టు షాపులపై సత్వరం చర్యలు తీసుకోవాలంటూ భద్రాచలం గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు.
బెల్టు షాపులపై చర్యలు తీసుకుంటామంటూ భద్రాచలం గ్రామ పంచాయితీ పాలకమండలి లో తీర్మానం జరిగి నేటికీ నెలరోజులపైగా కావస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోవడానికి వెనుకాడటానికి గల కారణాలు ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు…
ఇది ఇలా ఉంటే రామాలయానికి కూతవేటు దూరంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని, పాఠశాలలు దేవాలయాల పరిసర ప్రాంతాలలో మద్యం బెల్టు షాపులు నిర్వహించటం వల్ల అటుగా పోయే విద్యార్థులు, భద్రాద్రి దేవస్థానానికి వస్తున్న భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నా కూడా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన వారి పట్ల కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారనే అపవాదు లేకపోలేదని స్థానిక ప్రజలు సైతం ఆరోపిస్తున్నారు.
భద్రాద్రి పట్టణంలో అధిక సంఖ్యలో ఉన్న బెల్టు షాపులు స్థానిక ఎక్సైజ్ శాఖ సిబ్బంది కనుసన్నుల్లో నడుస్తున్నాయంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా చర్యలు తీసుకోవాలంటూ, భద్రాచలం గ్రామపంచాయతీ 4 వ వార్డు సభ్యుడు బండారు శరత్ బాబు.. 7వ వార్డు సభ్యుడు కావూరి గోపి,14 వ వార్డు సభ్యుడు ఇలమల అశోక్ కుమార్ 20 వ వార్డు సభ్యురాలు ఇర్ఫా అనసూయ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు.









