ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి వంద శాతం పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణ పనులను అత్యంత శరవేగంగా ముందుకు తీసుకెళుతోందని ప్రకటించారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారా ఏపీలో కరవు అనే మాటే లేకుండా చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.
గతంలో తాము కేవలం 12 నెలల రికార్డు కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చిన అపూర్వ విజయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పందిస్తూ.. ఈ నెల నుంచే రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. బడికి వెళ్లే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాకు ఎంతో ఘనమైన చారిత్రాత్మక నేపథ్యం ఉందని కొనియాడిన చంద్రబాబు, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లోనూ ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ముందంజలో ఉంచుతామన్నారు.
కేవలం ప్రాజెక్టులే కాకుండా నగరాలు, గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు ‘చెత్త నుంచి సంపద సృష్టి’ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. ఈ సభకు పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రజలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.









