తిరుమలలో గదుల కేటాయింపు ఇక సులభతరం: టీటీడీ నూతన విధానం పూర్తి వివరాలు

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులు వసతి గదుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానమ్స్) సరికొత్త సాంకేతికతతో స్వస్తి పలికింది. గదుల కోసం కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, ఉప విచారణ కార్యాలయాల ద్వారా భక్తులకు వేగంగా గదులను కేటాయించే సులభతరమైన విధానాన్ని అమలులోకి తెచ్చింది. వసతి గది కావాలనుకునే భక్తులు ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి సీఆర్వో కౌంటర్‌లో తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా దాని జిరాక్స్ కాపీతో పాటు మొబైల్ నంబర్ సమర్పించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో భక్తులు తమకు కావాల్సిన గది కేటగిరీని (A కేటగిరీ రూ.50/రూ.100 లేదా B కేటగిరీ రూ.1000) ఎంచుకున్నాక వారికి అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు.

రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, భక్తులు సీఆర్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్ ప్లే బోర్డుల ద్వారా తమ క్రమ సంఖ్యలను గమనిస్తూ ఉండాలి. గది కేటాయింపు జరగగానే 15 నిమిషాల్లోపు భక్తుడి మొబైల్ నంబర్‌కు పూర్తి వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోయినా, సీఆర్వో వద్ద ఉన్న కియోస్క్ మెషీన్లలో అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను స్కాన్ చేసి తమకు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయం (ANC, SNC, SMC, GNC కాటేజీలు లేదా సుదర్శన, గోవర్ధన్, నందకం తదితర విశ్రాంతి గృహాలు) వివరాలను తెలుసుకోవచ్చు. అనంతరం భక్తులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి గది అద్దె రుసుమును తప్పనిసరిగా ఆన్‌లైన్ పద్ధతిలో (యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, కార్డ్స్) మాత్రమే చెల్లించి తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నగదు చెల్లింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు.

నూతన విధానంలో భాగంగా టీటీడీ గదుల కేటాయింపు, నియమ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. గదిని పొందే భక్తునికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు ఒంటరి వ్యక్తులకు లేదా అవివాహితులకు గదులు కేటాయించబడవు. ఒకసారి తిరుమలలో గది పొందిన వారు తిరిగి 30 రోజుల వరకు మరో గదిని పొందేందుకు వీలుండదు. కాగా, వసతి గదులు కేవలం 24 గంటల కాలానికి మాత్రమే కేటాయిస్తారు. నిర్ణీత గడువు దాటితే 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం అదనపు రుసుము వసూలు చేస్తారు. భక్తులు తమకు కేటాయించిన గదిని ఇతరులకు బదిలీ చేయడం నిషిద్ధం మరియు గది పొందిన వ్యక్తి మాత్రమే స్వయంగా ఖాళీ చేయాల్సి ఉంటుంది, లేనిచో కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించబడదని అధికారులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు