తమిళనాడు సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు: ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో వివాదాస్పద మరియు బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యే జి. ఆర్. మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం (జూలై 20) అరెస్ట్ చేశారు. టీవీకే పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ అరెస్టు వార్త తెలియగానే డీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు మరియు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తూత్తుకుడి ఎస్పీ కార్యాలయంలో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.

ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగిస్తూ.. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఓటమిని పరోక్షంగా ఎద్దేవా చేస్తూ ‘తండ్రి కోసం వెతుకులాట’ అని చేసిన వ్యాఖ్యలపై మార్కండేయన్ తీవ్రంగా స్పందించారు. జులై 18న కోవిల్‌పట్టిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి శాసనసభలో తండ్రి కోసం వెతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో నిన్ను ఎలా చూసుకోవాలో మేము చూసుకుంటాం. ఆయన అసెంబ్లీ తలుపులు లాక్ చేస్తానని అంటున్నారు… ఒకవేళ ఆయన డోర్లు మూస్తే ఆయన ఎముకలు విరిగిపోతాయి. లాక్ చేసి చూపించమనండి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మార్కండేయన్ అరెస్టుకు సంబంధించిన వైరల్ వీడియోలో.. తాను శాసనసభ్యుడిని అయినందున అసెంబ్లీ స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా తనను అరెస్టు చేయలేరని పోలీసులతో వాదించడం కనిపించింది. అయినప్పటికీ, పోలీసులు ఆయనను ఒప్పించి స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ కేసు కంటే ముందు తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను కూడా ముఖ్యమంత్రిపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకే పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయనకు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినప్పటికీ అదే రోజు సాధారణ బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా జరిగిన మార్కండేయన్ అరెస్టును ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా ఖండించింది. అధికార పక్షం కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు