ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్: దావోస్ ఒప్పందానికి కార్యరూపం.. సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక మంత్రి భేటీ!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం కార్యరూపం దాల్చేందుకు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో అత్యాధునిక ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం అధికారికంగా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రీయ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ప్రత్యేకంగా భేటీ అయింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో జరిపిన ముఖాముఖి చర్చల ఫలితంగానే ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ ముగ్గుచూపింది. ఆ నాడు కుదిరిన అవగాహనను ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా యూఏఈ ప్రతినిధులు అమరావతికి విచ్చేశారు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక పూర్తిస్థాయి అంతర్జాతీయ వ్యాల్యూచైన్ వ్యవస్థను నెలకొల్పాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి, యూఏఈ ప్రతినిధులకు మధ్య అధికారిక పెట్టుబడుల భాగస్వామ్యం కుదిరింది.

ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పండే మామిడి, అరటి, కోకో వంటి ఉద్యానవన పంటల రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. ఇక్కడ పండే నాణ్యమైన ఉత్పత్తులను అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేసి, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్యాక్ చేసి గ్లోబల్ మార్కెట్లకు తరలించేలా ఈ క్లస్టర్ ద్వారా గట్టి నిబంధనలు, వ్యవస్థలను రూపొందిస్తారు. ఇది స్థానిక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ కీలక సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో పాటు ఏపీ ఈడీబీ (EDB) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు