నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. రాజమండ్రిలో జరుగుతున్న ఆయన తాజా చిత్రం ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆర్థోపెడిక్ సర్జన్లు మరియు ప్రత్యేక నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
షూటింగ్లో ఎడమ మోకాలికి గాయమైన వెంటనే తొలుత రాజమండ్రిలోని స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్సల కోసం ఆయన్ని ప్రత్యేక ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌కు తరలించి ఏఐజీలో చేర్చారు. ఆస్పత్రిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ ప్రాంతంలో మజిల్ టియర్ (కండరాల గాయం) ఉండే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
బాలకృష్ణ గత వైద్య చరిత్రను కూడా దృష్టిలో ఉంచుకుని, వివిధ విభాగాల నిపుణులతో కూడిన ఒక మల్టీడిసిప్లినరీ వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం సమీక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, వైద్యుల అబ్జర్వేషన్లోనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం కొనసాగుతున్న విస్తృత స్థాయి క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు పూర్తయిన తర్వాతే తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేస్తామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.









