పిఠాపురం కుర్రాడి సత్తా.. రూ.1.06 కోట్ల వేతనంతో కెనడా కంపెనీలో కొలువు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అద్భుతమైన ప్రతిభతో అత్యున్నత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మాల్తి అఖిలేశ్ అనే విద్యార్థి అత్యంత సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, ఏకంగా రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడాకు చెందిన ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అఖిలేశ్ తండ్రి దివ్యాంగుడైనప్పటికీ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి కూడా ఆయనకు తోడుగా ఉంటోంది.

సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అఖిలేశ్, ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో తన సత్తా చాటాడు. కెనడాకు చెందిన ‘క్వాంట్రైస్ టెక్ ఏఐ’ అనే సంస్థ అతడిని ఏఐ (AI) ఇంజినీర్‌గా ఎంపిక చేసుకుని ఈ భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలోనే ఉంటుందని, అఖిలేశ్ ఇప్పటికే తన విధుల్లో చేరినట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్యాంపస్ డ్రైవ్‌లో అఖిలేశ్‌తో పాటు రాజేశ్‌ అనే మరో విద్యార్థి కూడా ఇదే రూ.1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం విశేషం. తమ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం నుంచే ప్లేస్‌మెంట్స్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లే విద్యార్థులు ఈ స్థాయి సాధించగలిగారని యాజమాన్యం పేర్కొంది. పేదరికాన్ని, శారీరక వైకల్యాన్ని జయించి కొడుకును ఉన్నత చదువులు చదివించిన ఆ తల్లిదండ్రుల కృషిని, అఖిలేశ్ సాధించిన ప్రతిభను అభినందిస్తూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు