రాజధానిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాల సముదాయంగా మాత్రమే చూడరాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని ఒక బృహత్ ప్రణాళికగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ రెండు నగరాల్లోనూ మౌలిక వసతుల ప్రాజెక్టులను రాజధానికి అనుసంధానంగా అభివృద్ధి చేసినప్పుడే సమగ్ర రాజధాని రూపుదిడ్డుకుంటుందని ఆయన అన్నారు. మంగళవారం సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై సీఆర్డీఏ (CRDA) అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా పనులు
రాజధాని నిర్మాణ పనులను ‘స్పీడ్, క్వాలిటీ, డెలివరీ’ లక్ష్యంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంత పెరిగినప్పటికీ, అది ఏమాత్రం సరిపోదని, మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నామని హామీ ఇస్తూ, పనుల్లో ఎక్కడా జాప్యం జరగడానికి వీల్లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. రాజధాని నిర్మాణం వంటి గొప్ప అవకాశం దక్కినందుకు కాంట్రాక్టు సంస్థలు దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పర్యవేక్షణ
రాజధానిలో రూ. 50,999 కోట్ల విలువైన 95 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, నెలకు కనీసం 7.92 శాతం చొప్పున పనులు పూర్తి కావాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్ల వంటి కీలకమైన అంశాల్లో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపుపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రాజధాని నిర్మాణ పనుల పురోగతిని ఇకపై తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.









