జెన్ జీ (Gen Z) యువత మరియు మహిళలను ఉద్దేశించి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో భావోద్వేగాలను దెబ్బతీయడం సరికాదన్నారు. కంగన తన వ్యాఖ్యల వల్ల నొచ్చుకున్న బాధితులైన యువతకు, మహిళలకు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
ప్రజా జీవితంలోను, ప్రజాస్వామ్య వ్యవస్థలోను ఉన్నత స్థానాల్లో చలామణి అయ్యే వ్యక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించే సమయంలో కనీస సంయమనం, బాధ్యత వహించాలని నారాయణ సూచించారు. సమాజంలో విద్వేషాలు, విభేదాలను పెంచి పోషించేలా, ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కంగనా రనౌత్ మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు సామాజిక ఐక్యతకు భంగం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో న్యాయ వ్యవస్థలోని ఉన్నత సాంప్రదాయాలను నారాయణ అభినందించారు. గతంలో నిరసనకారులపై జరిగిన ‘బొద్దింకలు’ అనే వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించడాన్ని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల కలిగిన భావోద్వేగ బాధను గుర్తించి, వాటిని సరిదిద్దుకునేలా న్యాయస్థానం వ్యవహరించిన తీరు అత్యున్నత సాంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని, రాజకీయ నాయకులు కూడా తమ తప్పులను దిద్దుకునే వైఖరిని అలవర్చుకోవాలని హితవు పలికారు.









