హైదరాబాద్ నగరంలో రాబోయే గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సోమవారం రాత్రి వేళల్లో నగరవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని, వర్షం కురుస్తున్న సమయంలో అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నగరంలో కురిసే భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రమాదం ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రోడ్లు జారుడుగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు తమ వాహనాల వేగాన్ని తగ్గించి, రోడ్డు పరిస్థితులను గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలని డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని స్పష్టం చేశారు. నగరంలో వాతావరణం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణాలను వీలైనంత వరకు నివారించాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే పోలీసుల సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల ప్రాణాలకు మరియు ఆస్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు నగర పోలీసు శాఖ ఇప్పటికే అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని సీపీ వెల్లడించారు. ఇందులో భాగంగానే లోతట్టు ప్రాంతాల అధికారులను, విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ వాతావరణ హెచ్చరిలను సీరియస్గా తీసుకోవాలని, ప్రభుత్వ మరియు పోలీసు యంత్రాంగం జారీ చేసే ఆదేశాలకు పూర్తిగా సహకరించాలని కోరారు. ప్రమాదకరమైన ప్రాంతాలకు దూరంగా ఉంటూ, సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతూ తమ కుటుంబ సభ్యులను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని సీపీ సజ్జనార్ నగర ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.









