భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఆడతాడా లేదా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రోహిత్ ఎంతకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలనేది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయమేనని హేడెన్ పేర్కొన్నాడు.
అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడాలంటే శారీరక శక్తితో పాటు ఆకలి, ఉత్సాహం, అంకితభావం ఎంతో అవసరమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న అతడి భవిష్యత్తు 2027 ప్రపంచకప్ నేపథ్యంలో కీలకంగా మారింది.
అయితే వయసుపై చర్చ జరుగుతున్నప్పటికీ రోహిత్ తన బ్యాటింగ్‌తో విమర్శకులకు సమాధానం ఇస్తున్నాడు. 2026లో ఇప్పటివరకు ఆడిన 9 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 379 పరుగులు సాధించి 42.11 సగటును నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. దీంతో ఫిట్నెస్, ఫామ్‌ను కొనసాగిస్తే 2027 ప్రపంచకప్ వరకు రోహిత్ కొనసాగుతాడా అన్న అంశం మరింత ఆసక్తికరంగా మారింది.









