మార్కాపురంలోని శ్రీవిద్య కోచింగ్ సెంటర్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో “మన ఆరోగ్యం–మన చేతుల్లోనే” అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ చక్కిలం శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా ఆరోగ్య కన్వీనర్ డాక్టర్ బి. శరత్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు.
పాలు, గుడ్లు, రాగిజావ వంటి పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని డాక్టర్ శరత్ సూచించారు. జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.









