ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాలో అటవీ, భూభాగ మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా 1,07,465 హెక్టార్లకు పైగా భూమి మంటల ప్రభావానికి గురైంది. గతంలో ఎల్నినో ప్రభావం ఉన్న 2023 ఇదే కాలంతో పోలిస్తే ఇది 110 శాతం అధికం. రియావు, జాంబి, సౌత్ సుమత్రా, వెస్ట్, సెంట్రల్, సౌత్ కలిమంతన్ ప్రాంతాలను అధికారులు ప్రధానంగా గుర్తించారు.
తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో పొడి వాతావరణం, ఎండలు మంటలు వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయి. అయితే ఎల్నినో నేరుగా మంటలకు కారణం కాదని, భూమిని పొడిబార్చి మంటలు మరింత వేగంగా వ్యాపించే పరిస్థితిని కల్పిస్తోందని అధికారులు చెబుతున్నారు. పీట్ల్యాండ్ను కాల్చడం, భూమిని శుభ్రం చేసేందుకు మంటలు పెట్టడం వంటి మానవ కార్యకలాపాలు కూడా ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
మంటల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగతో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింది. వెస్ట్ కలిమంతన్లోని పొంటియానక్లో విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలల్లో తరగతులను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పొగ ప్రభావం పొరుగున ఉన్న మలేషియాలోని కొన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. మంటలను అదుపు చేసేందుకు ప్రభుత్వం 43 హెలికాప్టర్లు, 15 విమానాలను రంగంలోకి దించింది. వర్షం కురిపించేందుకు క్లౌడ్ సీడింగ్ ప్రయత్నాలు కూడా చేపడుతున్నప్పటికీ, తగిన వర్ష మేఘాలు లేకపోవడం అధికారులకు సవాలుగా మారింది.









