ఒక ఉద్యోగి నెలంతా జీతం కోసం ఎదురుచూస్తాడు. జీతం వచ్చిన వెంటనే ఇంటి అద్దె, EMIలు, పిల్లల ఫీజులు, కిరాణా వంటి ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ పోగా మిగిలిన కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకుంటాడు. అయితే అనుకోకుండా వచ్చే ఒక్క పెద్ద మెడికల్ బిల్లు మొత్తం ఆర్థిక ప్రణాళికను తలకిందులు చేసే పరిస్థితి ఏర్పడుతోంది.
కార్పొరేట్ ఉద్యోగం, క్రమం తప్పకుండా వచ్చే జీతం, కంపెనీ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. ఊహించని వైద్య ఖర్చులపై ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతోందని ఓ నివేదిక వెల్లడించింది. టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన ‘ది కార్పొరేట్ హెల్త్ ప్రొటెక్షన్ పల్స్ 2026’ నివేదిక ప్రకారం.. ఏకంగా 94 శాతం మంది ఉద్యోగులు అనుకోని మెడికల్ బిల్లు తమను ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొంది.
ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ అన్ని వైద్య ఖర్చులు పూర్తిగా కవర్ అవుతాయనే హామీ ఉండకపోవడం, పాలసీలోని పరిమితులు, ఆసుపత్రి ఖర్చులు పెరగడం వంటి అంశాలు ఉద్యోగుల్లో ఆర్థిక భద్రతపై ఆందోళనకు కారణమవుతున్నాయి. దీంతో అత్యవసర వైద్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య బీమాతో పాటు ప్రత్యేక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం కూడా అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.









