‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో యూత్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రిలీజ్ డేట్ వెనుక మౌళికి ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 5న విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ సెప్టెంబర్ మొదటి వారంలో ‘దొంగ నా కొడుకు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఒక జ్యువెలరీ షాప్ రాబరీ చుట్టూ సాగే క్రైమ్ అండ్ రాబరీ కామెడీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మౌళి కామెడీ టైమింగ్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉండటంతో సినిమాపై యూత్‌లో ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అండదండలు, ‘లిటిల్ హార్ట్స్’ సెంటిమెంట్ కలిసొస్తే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.









