జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించిన కేసు విచారణను జిల్లా కోర్టు సెప్టెంబర్ 9కు వాయిదా వేసింది. ఈ కేసులో అసలు పిటిషనర్ రాయలింగమూర్తి మృతి చెందడంతో విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం.
ఈ వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ మృతి చెందిన నేపథ్యంలో కేసు తదుపరి ప్రక్రియపై కూడా న్యాయస్థానం దృష్టి సారించింది.
ఇదిలా ఉండగా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో కేసీఆర్కు మరోసారి సమన్లు పంపించాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9న చేపట్టనున్నట్లు వెల్లడించింది.









