హైదరాబాద్లోని వాడి-ఎ-ముస్తఫా ప్రాంతంలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ దొంగ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉండగా, తీవ్రమైన మద్యం మత్తులో ఇంట్లోనే నిద్రపోయాడు.
ఉదయాన్నే నిద్రలేచిన ఇంటి యజమానులు తమ ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తి నిద్రిస్తుండటాన్ని చూసి షాక్కు గురయ్యారు. అతడిని పరిశీలించగా దొంగతనం చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం మత్తు కారణంగా బయటకు వెళ్లలేక అక్కడే నిద్రపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నిందితుడిని పట్టుకున్నారు. అతడు పట్టుబడిన తర్వాత కూడా తీవ్ర మద్యం మత్తులో ఉండటంతో సరిగ్గా స్పందించలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కుటుంబ సభ్యులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఈ విచిత్ర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.









