జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగార్థులు, విద్యార్థుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ‘JPSC-JSSC రిఫార్మ్స్ మంచ్’ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన గురువారానికి 20వ రోజుకు చేరుకుంది. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళన కొనసాగిస్తున్నారు.
రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరీక్షలను రద్దు చేసి, వాటిపై సీబీఐ లేదా రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థులు అసెంబ్లీ దిగ్బంధనానికి పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నియామక ప్రక్రియలో అవకతవకలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.









