బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మల్లేపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, వివిధ విభాగాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ఫైళ్ల పురోగతిపై పోలీస్ సిబ్బందితో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.
నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేలా పనిచేయాలని ఆదేశించారు.









