టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రేక్షకులను అలరించేందుకు మరో విభిన్న కథాంశంతో సిద్ధమవుతున్నారు. ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీర మల్లు’ వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత ఆమె ప్రధాన పాత్రలో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో సాగే ఈ సినిమాలో ఆమె ఇప్పటివరకు కనిపించని ఒక సరికొత్త, వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
వరాహ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. ‘తంత్ర’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించి, అదే రోజు నుంచి రెగ్యులర్ చిత్రీకరణను కూడా మొదలుపెట్టారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన నిధి ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక చేతిలో దీపం పట్టుకుని రక్షణగా నిలిచిన ఆమె వెనుక అనేక చేతులతో కూడిన దేవతా రూపం కనిపించడం కథలోని ఆధ్యాత్మిక నిగూఢతను స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.









