తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో రాగల కొద్ది రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ (Yellow Alert) జారీ చేసింది.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈదురుగాలులు, భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ ప్రకటనల హోర్డింగ్ల కింద ఎవరూ ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా, రైతులు తమ పంటల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.








