ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. గురువారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం సీఎం తిరిగి విజయవాడ చేరుకుని ఉండవల్లి నివాసానికి వెళ్లనున్నారు.
రాష్ట్రాల మధ్య పరస్పర సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరిగే ఈ కౌన్సిల్ భేటీలో ప్రధానంగా విభజన చట్టం పెండింగ్ అంశాలు, ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలు, సరిహద్దు అంశాలు, నీటి పంపిణీ వివాదాలు మరియు అంతర్రాష్ట్ర రవాణా వంటి విషయాలపై విస్తృతంగా చర్చించి సిఫార్సులు చేయనున్నారు. గతంలో తిరువనంతపురంలో జరిగిన 30వ సదస్సులో పలు కీలక సమస్యలపై చర్చలు జరగ్గా, తాజా సమావేశంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.








