హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు బయలుదేరాల్సిన ఇండిగో విమానానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. విమానం ఇంకా శంషాబాద్ విమానాశ్రయంలోనే ఉన్న సమయంలో ఈ హెచ్చరిక సందేశం అందడంతో విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. భోగాపురం నూతన విమానాశ్రయానికి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ తరహా బెదిరింపు రావడం గమనార్హం.
సమాచారం అందిన వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానంతో పాటు లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ భద్రతా ప్రొటోకాల్స్‌ను అమలు చేశారు.
మరోవైపు, ఈ బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు మరియు నిఘా వర్గాలు లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని భద్రతా అధికారులు సూచించారు.









