ఆర్బీఐ కీలక ముసాయిదా: ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ప్రతి 3 నెలలకోసారి వడ్డీ రేట్ల సవరణ

ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో హోమ్ లోన్ మరియు ఇతర రుణాలు తీసుకున్న వారికి మరింత మేలు చేకూర్చేలా, పారదర్శకతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిబంధనల ముసాయిదాను ప్రతిపాదించింది. రెపో రేటు మార్పుల ప్రయోజనాన్ని వేగంగా రుణగ్రహీతలకు బదిలీ చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాల సేకరణకు 2026 సెప్టెంబర్ 11 వరకు గడువు విధించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుతం చాలా బ్యాంకులు ఏడాదికి ఒకసారి మాత్రమే వడ్డీ రేట్లను సవరిస్తుండటంతో, ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు ఆ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరడానికి చాలా సమయం పడుతోంది. దీనికి పరిష్కారంగా, ఇకపై ఫ్లోటింగ్ రేట్ రుణాలపై గరిష్ఠంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా రేట్లను సవరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. దీనివల్ల రేట్ల కోత ప్రయోజనం ఎంత త్వరగా అందుతుందో, భవిష్యత్తులో రేట్లు పెరిగినప్పుడు ఆ భారం కూడా అంతే వేగంగా పడే అవకాశముంది.

ఈ నిబంధనలు కేవలం ఫ్లోటింగ్ రేట్ ఆధారిత రుణాలకు మాత్రమే వర్తిస్తాయి తప్ప స్థిర వడ్డీ రేటు (Fixed Rate) ఉండే పర్సనల్, ఆటో రుణాలపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్ రుణాలు తీసుకున్న పాత కస్టమర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి అదనపు రుసుము లేకుండా తమ రుణాలను కొత్త విధానంలోకి మార్చుకోవడానికి 2029 ఏప్రిల్ 1 వరకు తగిన సమయం ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా గృహ రుణాలు తీసుకునేవారు బ్యాంకుల స్ప్రెడ్ మార్జిన్, రీసెట్ ఫ్రీక్వెన్సీని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు