దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాల ప్రమోషన్స్‌లోనూ ప్రత్యేకత చూపిస్తుంటారు. తాజాగా వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్, విడుదల తేదీని వినూత్నంగా ప్రకటించారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ బావా బామ్మర్ది పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
చిత్రబృందం తాజాగా సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేసింది. దీనికి ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. టైటిల్ ప్రకటన వీడియోలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి సినిమా పేరేంటని అడగగా.. అనిల్ రావిపూడి పదేపదే ‘జనవరి 12 విడుదల’ అని చెబుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని తెలియడంతో హీరోలు సరదాగా స్పందిస్తారు. ఈ వీడియోలో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ‘అప్పుల అప్పారావు’ కామెడీ సీక్వెన్స్‌ను గుర్తు చేసేలా రూపొందించడం విశేషం.
2027 సంక్రాంతి బరిలో ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్‌కు అనిల్ రావిపూడి కామెడీ తోడవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.









