విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా.. ఎమ్మెల్యే విద్యా యాత్ర
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే జారే సమీక్షా సమావేశం..
పిల్లల లక్ష్యాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. విద్యార్థులతో కలిసి భోజనం
ఆగస్టు 22:..TODAY9NEWS
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS)లో ‘నేను సైతం చేయూత’ కార్యక్రమంలో భాగంగా ‘విద్యా యాత్ర–మన ఎమ్మెల్యే.. మన బడి’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల చదువు, నైపుణ్యాలు, విద్యా ప్రగతిపై స్వయంగా ఆరా తీశారు. విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు. ఉపాధ్యాయులు అందిస్తున్న బోధన, విద్యార్థుల సమస్యలపై సమగ్రంగా చర్చించారు.
అనంతరం ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు టిఫిన్, భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈద్దప్ప, మాజీ సర్పంచులు మడకం రాజేష్, కారం సుధీర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.









