రూ. 22,006 కోట్ల బకాయిలు.. రూ. 6.5 కోట్లతో సెటిల్మెంట్!…
°మీడియా దిగ్గజం సుభాష్ చంద్ర కేసులో ఎన్సీఎల్టీ ఉత్తర్వులు…
°99.97 శాతం ‘హెయిర్కట్’కు ఆమోదం…
మీడియా దిగ్గజం, జీ/ఎస్సెల్ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్రకు సంబంధించిన దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనూహ్యమైన తీర్పునిచ్చింది.
సుభాష్ చంద్ర తమకు దాదాపు రూ. 22,006.57 కోట్లు బకాయి పడ్డారంటూ రుణదాతలు క్లెయిమ్ చేస్తుండగా.. వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఆయన కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎన్సీఎల్టీ తాజాగా ఆమోదం తెలిపింది.
ఎన్సీఎల్టీ మెంబర్ (జ్యుడీషియల్) నీలేశ్ శర్మ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ చట్టం (ఐబీసీ)లోని సెక్షన్ 114 ప్రకారం ఈ రీపేమెంట్ ప్లాన్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రుణదాతల బకాయిల్లో సుమారు 99.97 శాతం హెయిర్కట్ (కోత) విధించినట్లయ్యింది.
ఈ రికవరీని ఆమోదించడానికి అర్హత లేనంత తక్కువ స్థాయిలో ఉందన్న రుణదాతల అభ్యంతరాలను ఆయన తరుపు న్యాయ నిపుణులు తోసిపుచ్చారు.
అంతకుముందు ఎన్సీఎల్టీలో ఇద్దరు సభ్యులు ఈ కేసులో విభిన్నమైన తీర్పులు ఇవ్వడంతో, అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఫోరమ్ ప్రెసిడెంట్ దీనిపై శర్మను మూడో మెంబర్గా నియమించారు.
సుభాష్ చంద్రకు ఉన్న తెలివి.. కింగ్ ఫిషర్ మాల్యాకు లేదా?
బ్యాంకులు, రుణాదాతలు ఇచ్చిన వేల కోట్ల అప్పుల్ని.. ఓ ఆరు కోట్లు ఇచ్చేసి సెటిల్ చేసుకునే ప్రయత్నంలో ఎస్సెల్, జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్ర ఉన్నారు. ఆయనతో పోలిస్తే విజయ్ మాల్యా అప్పులు చాలా తక్కువే అని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి చట్టపరమైన మార్గాలు తెలియక విజయ్ మాల్యా పారిపోయారా? అనే సందేహం కూడా వ్యక్తపరుస్తున్నారు.
తన అప్పుల కంటే ఎక్కువ ఉన్న ఆస్తులు తీసుకున్నారని మాల్యా గగ్గోలు పెడుతున్నారు కూడా. పారిపోకుండా ఇలా సెటిల్ చేసుకుని ఉంటే సరిపోయేదిగా! అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు సుభాష్ చంద్ర హ్యాపీ, కాగా మాల్యా ఆస్తులే కాదు పరువూ పోగొట్టుకున్నారు.బాగా అప్పులు చేసి జల్సాలు చేయడమే కాదు.. ఎగ్గొట్టే తెలివి తేటలు కూడా ఉండాలేమో? అంటూ మరి కొందరు చమత్కరిస్తున్నారు..









